కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!
- సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ
- రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన పవన్
- నదీ జలాల స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాగునీటి ఎద్దడి, కలుషితమవుతున్న నదుల పరిరక్షణ, జల్ జీవన్ మిషన్ అమలు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటి కొరత తీరలేదని పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజలకు స్థిరమైన తాగునీటి సరఫరా అందించడానికి గుజరాత్‌లోని 'సూరత్ నమూనా'ను అధ్యయనం చేయాలని అధికారులకు పవన్ సూచించారు. సూరత్‌లో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేసి మళ్లీ ఎలా విజయవంతంగా వినియోగిస్తున్నారో, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అన్నారు.
గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో నదీ జలాల స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ స్పష్టం చేశారు. పారిశ్రామిక కాలుష్యం వల్ల ఏపీలోని నదులు, జలవనరులు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు వదిలే వ్యర్థాల వల్ల నదులు కలుషితం కాకుండా ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.